Latest Posts

చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు: రైతులు ఆందోళన చెందవద్దు – కలెక్టర్ సుమిత్ కుమార్

  • యూరియా కొరత లేదు
  • రైతులు ఆందోళన చెందవద్దు
  • రబీ సీజన్‌కు సరిపడా నిల్వలు సిద్ధం
    -కలెక్టరు సుమిత్ కుమార్

చిత్తూరు జిల్లాలో యూరియా ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని… రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టరు సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఎరువుల లభ్యత మరియు పంపిణీ తీరును సమీక్షించారు. జిల్లాలో రబీ సీజన్ కోసం మొత్తం 20,183 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టరు తెలిపారు. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు 5,747 మెట్రిక్ టన్నుల అవసరం ఉండగా… ఇప్పటికే 6,753 మెట్రిక్ టన్నులను అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెలాఖరుకు మరో 500 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరుకోనున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆర్.ఎస్.కె మార్క్ ఫెడ్, సొసైటీల వద్ద 1,558 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డీలర్లు బస్తాపై ఉన్న ఎం.ఆర్.పి ధరలకే విక్రయించాలి. రైతులు తప్పనిసరిగా రసీదు పొందాలి. కృత్రిమ కొరత సృష్టించినా లేదా అధిక ధరలకు విక్రయించినా ‘ఎరువుల నియంత్రణ చట్టం 1985’ ప్రకారం లైసెన్సులు రద్దు చేసి, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీనియర్ అధికారులు తరచూ రైతు సేవా కేంద్రాలను సందర్శించి, నిల్వల వివరాలను బోర్డులపై ప్రదర్శించేలా చూడాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదిక సమర్పించాలని సూచించారు.

నానో ఎరువులపై అవగాహన

సాంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న ‘నానో యూరియా’, ‘నానో డి.ఎ.పి’ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. పంట అవసరాలను బట్టి శాస్త్రీయంగా యూరియా వాడాలని, వృథా చేయవద్దని కోరారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor