Latest Posts

వైకుంఠ ఏకాదశి వేళ తిరుమలకు రేవంత్ రెడ్డి: కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమల క్షేత్రానికి చేరుకున్నారు. రేపు (మంగళవారం) జరగనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. చైర్మన్ ఆయనను శాలువాతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.

ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. రేపు ఉదయం వీరందరూ కలిసి అత్యంత పవిత్రమైన వైకుంఠ ద్వారం (ఉత్తర ద్వారం) గుండా స్వామివారిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ స్వాగత కార్యక్రమంలో ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం తిరుమల నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. ఎల్లుండి (బుధవారం) నుంచి తెలంగాణ అసెంబ్లీలో జరగనున్న కీలక సమావేశాలకు ఆయన హాజరుకానున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

Editor