Latest Posts

రాయచోటి ప్రజలకు క్షమాపణలు: కన్నీటి పర్యంతమైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి!

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగించి, మదనపల్లెను కేంద్రంగా చేస్తూ ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఆ ప్రాంత ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా రాయచోటి ప్రజలకు జరిగిన నష్టాన్ని తలుచుకుని కన్నీళ్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ ప్రజలకు జిల్లా కేంద్ర హోదాను కాపాడలేకపోయినందుకు బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు.

రాయచోటిని జిల్లా కేంద్రంగా నిలబెట్టేందుకు తాను చివరి వరకు చేసిన పోరాటం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలుసని మంత్రి పేర్కొన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే, పరిపాలనాపరమైన సవాళ్ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సీఎం తనకు వివరించినట్లు ఆయన తెలిపారు. రాజకీయాల్లో ఏ గాడ్ ఫాదర్ లేకుండా స్వశక్తితో ఎదిగిన తనకు, తన ప్రాంత ప్రజల భవిష్యత్తు అత్యంత ముఖ్యమని, జిల్లా కేంద్రం మార్పు అనేది తన జీవితంలోనే అత్యంత బాధాకరమైన సంఘటన అని ఆయన పేర్కొన్నారు.

అయితే, జిల్లా కేంద్ర హోదా కోల్పోయినప్పటికీ రాయచోటి అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేది లేదని రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రాయచోటిని ఒక అగ్రగామిగా, అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన ప్రణాళికాబద్ధమైన నగరంగా తీర్చిదిద్దుతామని, ఇందుకు ముఖ్యమంత్రి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు తగిన సమయంలో సమాధానం చెబుతానని, రాయచోటి అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానని ఆయన పునరుద్ఘాటించారు.

Posted Under AP
Editor