మహిళలు మరియు హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ సినీ నిర్మాత ఎస్కేఎన్ తీవ్రంగా ఖండించారు. ఇటీవల ‘పతంగ్’ చిత్ర సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఆయన, అమ్మాయిలు తమకు ఏ దుస్తులు సౌకర్యంగా, నమ్మకంగా అనిపిస్తే వాటినే ధరించాలని సూచించారు. ఏ “బట్టల సత్తిగాడి” మాటలు వినాల్సిన అవసరం లేదంటూ శివాజీ పేరు ఎత్తకుండానే పరోక్షంగా సెటైర్లు వేశారు.
హీరోయిన్లు చీరలే కట్టుకోవాలని, గ్లామర్ డ్రెస్సులు వేయకూడదని శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే పరిశ్రమలో పెద్ద దుమారం రేపాయి. దీనిపై ఎస్కేఎన్ స్పందిస్తూ.. ఈ దుస్తులు వేస్తే బాగుంటారు, ఆ దుస్తులు వేస్తే చెడిపోతారు అనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మనిషి వ్యక్తిత్వం అనేది గుండెల్లోనూ, ఆలోచనల్లోనూ ఉంటుందని.. కేవలం దుస్తుల్లో ఏమీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. మన మనసు మంచిదైతే మనకు మంచే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
అనసూయ, చిన్మయి వంటి ప్రముఖులు ఇప్పటికే శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేయగా, మహిళా కమిషన్ కూడా ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘పతంగ్’ హీరోయిన్ ప్రీతి పగడాల జీన్స్, టాప్ ధరించి సక్సెస్ మీట్‌కు రావడాన్ని ఉదహరిస్తూ.. గ్లామర్ అనేది ధరించే వారి ఆత్మవిశ్వాసానికి సంబంధించిందని, ఇతరుల విమర్శలకు తలొగ్గవద్దని ఆయన ధైర్యం చెప్పారు.
