నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో ‘జీరో డ్రగ్స్’ (Zero Drugs) లక్ష్యంగా పని చేయాలని పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ అధికారులను ఆదేశించారు. పబ్‌లు, హోటళ్లు మరియు రెస్టారెంట్లు ఖచ్చితంగా రాత్రి 1 గంటకు మూసివేయాలని స్పష్టం చేశారు. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే లేదా డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహిస్తే సంబంధిత యాజమాన్యాల లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టాస్క్‌ఫోర్స్, హెచ్-న్యూ, స్పెషల్ బ్రాంచ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
నగరంలో కేవలం ప్రధాన వేదికలే కాకుండా, సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీల పైన కూడా ప్రత్యేక నిఘా ఉంచినట్లు సీపీ తెలిపారు. గత రెండేళ్లలో డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి జాబితాను సిద్ధం చేసి, వారి కదలికలను నిశితంగా గమనిస్తున్నామన్నారు. మైత్రివనం, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ మరియు కేబీఆర్ పార్క్ వంటి రద్దీ ప్రాంతాల్లో పటిష్టమైన చెక్ పోస్టులు, బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు, వేడుకల పేరుతో సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. డ్రింక్ అండ్ డ్రైవ్ పరీక్షలను ముమ్మరం చేస్తామని, మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని యువతకు హితవు పలికారు. పోలీసులు అందరూ సమన్వయంతో పనిచేసి, నగరంలో వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. నిబంధనలను గౌరవిస్తూ పౌరులు తమ వేడుకలను జరుపుకోవాలని ఆయన కోరారు.
