కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు: మటన్ కొట్టులో పని ఇప్పిస్తానంటూ ఎద్దేవా!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్ పర్యటనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ “తోలు తీస్తా” అని చేసిన వ్యాఖ్యలపై రేవంత్ సెటైర్లు వేశారు. కేసీఆర్ రెండేళ్ల పాటు ఫామ్ హౌస్‌లో ఉండి బహుశా తోలు తీయడం బాగా ప్రాక్టీస్ చేసినట్టు ఉన్నారని, అందుకే ఇప్పుడు బయటకు వచ్చి అదే మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి ఇలాంటి హెచ్చరికలు తగవని మండిపడ్డారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అత్యంత ఘాటుగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “షేక్‌పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు.. ఆయనకు చెప్పాను, మా కేసీఆర్ ఖాళీగా ఉన్నాడు, బాగా తోలు తీస్తాడంటా, పనిలో పెట్టుకోమని చెప్పాను” అంటూ విమర్శించారు. అంతటితో ఆగకుండా, పని అయిపోయాక వెళ్లేటప్పుడు ఆయనకు కూలీ కింద ‘బోటినో, తలకాయనో’ ఇవ్వు అని చెప్పానంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఒక అగ్రనేతను ఉద్దేశించి ‘మటన్ కొట్టు’ వ్యాఖ్యలు చేయడంపై విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మాటల యుద్ధం రాబోయే అసెంబ్లీ సమావేశాలపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది. కేసీఆర్ “తోలు తీస్తా” అని హెచ్చరిస్తుంటే, రేవంత్ రెడ్డి ఆయనకు “నౌకరి” ఇప్పిస్తానని అనడం ఇరు పార్టీల మధ్య ఉన్న వైరాన్ని పతాక స్థాయికి చేర్చింది. అభివృద్ధి మరియు ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన వేదికలపై ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చోటుచేసుకోవడం పట్ల సామాన్య ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఈ వ్యాఖ్యలకు ఎలాంటి కౌంటర్ ఇస్తాయో వేచి చూడాలి.

Editor