రేణిగుంట, రైల్వే కోడూరు రహదారిలో వాహన తనిఖీలు చేస్తుండగా కారులో రవాణా చేస్తున్న 12ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కారు, పైలట్ గా ఉపయోగిస్తున్న బైక్ ను సీజ్ చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు కార్యాచరణ మేరకు ఆర్ ఎస్ఐ లింగాధర్ టీమ్ ఎప్బీఓ పి.చెంగలరాయుడుతో కలసి శనివారం తెల్లవారు జాము నుంచి రైల్వే కోడూరు రోడ్డులో ఉన్న ఆంజనేయపురం ఫారెస్ట్ చేక్ పోస్టు వద్దకు చేరుకుని వాహన తనిఖీలు చేపట్టారు. సుమారు 5గంటల ప్రాంతంలో ఒక బైక్ లో ఒక వ్యక్తి వచ్చి, పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అతన్ని పట్టుకోగా, వెనకే వస్తున్న కారు తప్పించుకునేందుకు ప్రయత్నించింది. దీంతో కారును చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, డ్రైవరు కారును తప్పించబోయి అక్కడే ఆగి ఉన్న లారీని ఢీ కొన్నాడు. దీంతో కారు ముందు భాగం ధ్వంసమయ్యింది. కారులోని కొందరు వ్యక్తులు దిగి పారిపోసాగారు. అయితే టాస్క్ ఫోర్సు పోలీసులు వారిని వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కారులో చూడగా అందులో 12ఎర్రచందనం దుంగలు లభించాయి. వాహనాలు, ముగ్గరు స్మగ్లర్లతో సహా ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన వారిలో ఒకరు రేణిగుంటకు చెందిన వ్యక్తి కాగా, మరో ఇద్దరు తమిళనాడు సేలం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
వాహన తనిఖీల్లో పట్టుబడ్డ 12ఎర్రచందనం దుంగలు – ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు.
