కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుపై చర్చ మరోసారి తీవ్రస్థాయికి చేరింది. శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మరియు తనను ఢిల్లీకి పిలుస్తామని పార్టీ హైకమాండ్ ఫోన్‌లో తెలియజేసిందని వెల్లడించారు. “సరైన సమయం వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి ఢిల్లీకి వెళ్తాము. ఈ విషయాన్ని మీడియాకు చెప్పకుండా దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం మాకు లేదు” అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
కాగా, శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. “తానే పూర్తి ఐదేళ్ల పాటు సీఎంగా కొనసాగుతానని, అధికారం పంచుకునే ఒప్పందం ఏదీ లేదని” ప్రకటించారు. దీనికి భిన్నంగా, శనివారం డీకే శివకుమార్ స్పందిస్తూ.. “మేము ఒక ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం” అని పేర్కొనడం గమనార్హం. సిద్ధరామయ్య తన వర్గీయులతో వరుసగా విందు సమావేశాలు నిర్వహిస్తుండగా, డీకే శివకుమార్ మౌనంగా ఉంటూ అధిష్ఠానం నిర్ణయం కోసం వేచి ఉండటం రాష్ట్రంలో అధికార మార్పిడిపై ఊహాగానాలను మరింత బలపరుస్తోంది.
మంగళవారం తాను అధికారిక పనుల నిమిత్తం ఢిల్లీకి వెళ్తున్నట్లు డీకే శివకుమార్ తెలిపారు. నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశంలో పాల్గొని, మేకెదాటు, మహదాయి మరియు కృష్ణా జలాల వివాదాలపై కేంద్ర మంత్రులను కలుస్తానని చెప్పారు. అవకాశం ఉంటే ప్రధానమంత్రిని కూడా కలుస్తానని ఆయన వివరించారు. ఈ ఢిల్లీ పర్యటనలో ఆయన పార్టీ అగ్రనేతలను కూడా కలిసి నాయకత్వ మార్పుపై చర్చించే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
