బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్‌లో ఉన్న భారత వీసా దరఖాస్తుల కేంద్రాన్ని (IVAC) భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం (డిసెంబర్ 17) మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. నిరసనకారుల ముట్టడి యత్నాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో దౌత్య సిబ్బంది రక్షణ కోసం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందిస్తూ, బంగ్లాదేశ్ హైకమిషనర్ ముహమ్మద్ రియాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. ఢాకాలోని భారత హైకమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తతలు సృష్టించేందుకు కొన్ని తీవ్రవాద శక్తులు కుట్ర చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. దౌత్య సిబ్బందికి మరియు కార్యాలయాలకు పూర్తిస్థాయి భద్రత కల్పించాల్సిన బాధ్యత బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంపై ఉందని భారత్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
మరోవైపు, భారత్‌కు వ్యతిరేకంగా ఢాకాలో నిరసనకారులు భారీ మార్చ్ నిర్వహించారు. మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు దేశం విడిచి వెళ్లిన వారిని తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ భారత హైకమిషన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. బంగ్లాదేశ్‌లో కొన్ని శక్తులు భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది.
