‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ విడుదల: థియేటర్ టెక్నీషియన్లకు జేమ్స్ కామెరూన్ ప్రత్యేక లేఖ

ప్రపంచ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గత భాగాల విజయాల నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో పాండోరా ప్రపంచానికి కొత్త శత్రువుగా వరాంగ్ అనే పాత్రను పరిచయం చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సినిమా విడుదలకు కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో, కామెరూన్ ఈసారి ప్రమోషన్లకే పరిమితం కాకుండా థియేటర్ల నిర్వహణపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

తాజాగా, జేమ్స్ కామెరూన్ థియేటర్ టెక్నీషియన్లకు, యజమానులకు ఒక ప్రత్యేక లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా ఆయన చాలా స్పష్టంగా కొన్ని సూచనలు మరియు హెచ్చరికలు చేశారు. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ను ప్రేక్షకులకు అందించేందుకు తమ టీమ్ ఉత్సాహంగా ఉందని పేర్కొంటూ, సినిమాతో పాటు పంపిన DCPలో ఉన్న ప్రొజెక్షన్ స్పెసిఫికేషన్ ఫైల్ మరియు ఫ్రేమింగ్ చార్ట్‌ను తప్పకుండా పాటించాలని సూచించారు. ముఖ్యంగా, లైట్ లెవల్స్, సరైన ఫ్రేమింగ్, మరియు ఆడియో కాన్ఫిగరేషన్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.

ఈ సినిమాను తానే వ్యక్తిగతంగా మిక్స్ చేశానని కామెరూన్ వెల్లడించారు. నిశ్శబ్దమైన డైలాగ్ సన్నివేశాల నుంచి భారీ యాక్షన్ సీన్స్ వరకు పూర్తి డైనమిక్స్ ప్రేక్షకులకు చేరాలంటే, 7.0 రిఫరెన్స్ సౌండ్ లెవల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించవద్దని ఆయన గట్టిగా చెప్పారు. పూర్తి అనుభూతిని అందించడంలో థియేటర్ నిర్వహణ కీలకమని ఆయన స్పష్టం చేశారు.

Editor