గానగంధర్వుడు, దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీ బాలు) విగ్రహావిష్కరణ హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో జరిగింది. ఈ కాంస్య విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ విగ్రహాన్ని తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా 7.2 అడుగుల ఎత్తులో తయారు చేయించారు.
విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈరోజు సాయంత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఇష్టమైన 20 పాటలతో 50 మంది కళాకారులు పాల్గొనే సంగీత విభావరి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. బాలుకు నివాళి అర్పిస్తూ ఈ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలు సోదరి, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ స్పందించారు. రవీంద్ర భారతిలో తన విగ్రహాన్ని పెట్టాలన్నది బాలసుబ్రహ్మణ్యం యొక్క చివరి కోరిక అని ఆమె వెల్లడించారు. ఈ కోరికను ఆయన ఆర్కెస్ట్రా సభ్యుల వద్ద వ్యక్తం చేయగా, వారు ఆయనను వారించినట్లు గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఆయన కోరిక నెరవేరిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. బాలు ఎప్పుడూ తెలుగును మరిచిపోవద్దని, క్రమశిక్షణగా ఉండాలని చెప్పేవారని ఆమె అన్నారు.
