సచివాలయ ఉద్యోగులను బీఎల్‌వో విధుల నుంచి తప్పించండి: సీఎం చంద్రబాబుకు సీపీఐ లేఖ

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల బూత్ స్థాయి అధికారి (బీఎల్‌వో) విధుల నుంచి మినహాయించాలని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఒక లేఖ రాశారు. సచివాలయ ఉద్యోగులు అదనపు పనిభారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి పని ఒత్తిడిని తగ్గించాలని ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే 16 రకాల సర్వేలతో పాటు ఇతర పనులతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఈశ్వరయ్య లేఖలో పేర్కొన్నారు. ఈ పని భారానికి అదనంగా ఎన్నికల విధులు కూడా తోడవడంతో వారు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలల్లోనే పని ఒత్తిడి కారణంగా నలుగురు సచివాలయ ఉద్యోగులు మరణించడం అత్యంత బాధాకరమని ఆయన వెల్లడించారు.

అంతేకాకుండా, కర్నూలు జిల్లాలో 600 మందికి పైగా సచివాలయ ఉద్యోగులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని ఈశ్వరయ్య తీవ్రంగా తప్పుబట్టారు. ఇది దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సచివాలయ ఉద్యోగులపై పని భారం తగ్గించాలని, వారిని బీఎల్‌వో విధుల నుంచి మినహాయించాలని ఈశ్వరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

Posted Under AP
Editor