Latest Posts

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ 50% సీట్లు కూడా గెలవలేదు: ఈటల రాజేందర్ విమర్శ

బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై స్పందించారు. స్థానిక ఎన్నికలు సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని అంగీకరిస్తూనే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 50 శాతం సీట్లు కూడా గెలవలేదని ఆయన విమర్శించారు. అయినప్పటికీ, గెలిచిన వారిలో చాలామందిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూస్తే ప్రజలకు కాంగ్రెస్ పట్ల ఎంత విముఖత ఉందో అర్థమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి ‘ఈవెంట్ మేనేజర్‌లా’ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో మ్యాచ్ ఆడుతున్నారని విమర్శించారు. సింగరేణి క్వార్టర్లు బాగు చేయడానికి, సిబ్బందికి వేతనాలు ఇవ్వడానికి డబ్బులు లేనప్పటికీ, సింగరేణి డబ్బులు రూ. 100 కోట్లు పెట్టి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టాలని ఈటల డిమాండ్ చేశారు. ‘హైడ్రా’ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని, కానీ పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని స్థానిక ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Editor