ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటనలో భాగంగా సాల్ట్ లేక్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంలో తీవ్ర గందరగోళం, ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెస్సీని చూడటానికి వచ్చిన వందలాది మంది అభిమానులు అదుపు తప్పి భద్రతా వలయాలను ఛేదించుకుని స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. దాదాపు అరగంట పాటు మెస్సీ అక్కడే ఉన్నా, తమ అభిమాన ఆటగాడిని చూడలేకపోయిన కోపంతో అభిమానులు బాటిళ్లు, కుర్చీలు విసిరారు. పరిస్థితి అదుపు తప్పడంతో మెస్సీని నిర్వాహకులు వెంటనే అక్కడి నుంచి తరలించాల్సి వచ్చింది, దీంతో ఈవెంట్ అర్ధాంతరంగా ముగిసింది.
ఈ దురదృష్టకర సంఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. జరిగిన సంఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, సరైన కార్యక్రమ నిర్వహణ లేకపోవడం తనను షాక్‌కు గురి చేసిందని పేర్కొన్నారు. ఈ గందరగోళం కారణంగా సూపర్ స్టార్ షారుక్ ఖాన్, సౌరవ్ గంగూలీ వంటి ప్రముఖులు కూడా పాల్గొనలేకపోయారు. జరిగిన సంఘటనపై మెస్సీకి మరియు క్రీడాభిమానులకు తాను హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నానని దీదీ ప్రకటించారు.
ఈ ఘటనకు గల కారణాలను గుర్తించడానికి మరియు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నివారించడానికి, రిటైర్డ్ జడ్జి ఆశిమ్ కుమార్ రే అధ్యక్షతన ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే, రూ. 3,500 నుంచి రూ. 14,000 వరకు టికెట్లు కొన్నప్పటికీ మెస్సీని చూడలేకపోయినందుకే అల్లర్లు చెలరేగాయని పేర్కొంటూ బీజేపీ నేతలు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కనీస ప్రణాళిక, భద్రత లేకపోవడం అంతర్జాతీయ వేదికపై రాష్ట్రానికి అవమానమని బీజేపీ నేతలు విమర్శించారు.
