కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి తెరలేపింది. ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. ఇప్పటివరకు మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఉన్న పేరును ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’ గా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పేరు మార్పునకు కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. అంతేకాకుండా ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇప్పటివరకు ఉన్న పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచింది. ఇక ఉపాధి హామీ కూలీల రోజువారీ వేతనాన్ని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా పల్లెల్లో ఉండే పేదలకు ఉపాధి కల్పించే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’గా మార్చే నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఇప్పటివరకు ఈ పథకంలో 100 రోజుల పని దినాలు ఉండగా.. వాటిని సంవత్సరానికి 125 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ బిల్లు’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక ఒక రోజుకు కూలీలకు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇక ఈ ‘పూజ్య గ్రామీణ రోజ్‌గార్ యోజన’ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1.51 లక్షల కోట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుంది. వాస్తవానికి ఈ పథకం 2005లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వం.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో ప్రారంభించారు. ఆ తర్వాత దానికి మహాత్మా గాంధీ పేరును జోడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు జీవనోపాధి భద్రతను పెంచడమే ప్రధాన లక్ష్యంగా ఈ పథకం కొనసాగుతోంది.
