‘అఖండ 2’ సినిమా టికెట్ రేట్ల వివాదంలో నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక జీవోను సింగిల్ బెంచ్ రద్దు చేయగా, చిత్ర నిర్మాణ సంస్థ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసుకుంది. దీనిని విచారించిన డివిజన్ బెంచ్ దానిపై స్టే విధించింది. ఈ నెల 14 వరకు స్టే కొనసాగుతుందని, తదుపరి విచారణ డిసెంబర్ 15న జరుగుతుందని న్యాయస్థానం తెలిపింది. దీంతో నిర్మాతలకు తాత్కాలిక ఉపశమనం దక్కింది.
‘అఖండ 2’ సినిమా థియేటర్లలో విడుదలైనా, వివాదాలు మాత్రం వదలడం లేదు. రిలీజుకు ముందు నిర్మాతల ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇబ్బంది పెడితే, రిలీజ్ తర్వాత టికెట్ రేట్ల విషయంలో పిటిషన్లు దాఖలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలకి అనుమతిస్తూ, టికెట్ పై అదనంగా రూ.600 పెంచుకోడానికి వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక జీవోను మొదట హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు, 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. అయితే, దీనిపై నిర్మాణ సంస్థ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయగా, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించడంతో నిర్మాతలకు తాత్కాలిక ఊరట లభించింది. తదుపరి విచారణతో ఈ వివాదానికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
