తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన పీఎస్‌లో లొంగిపోయారు. ప్రభాకర్ రావును కొన్ని గంటలపాటు విచారించనున్నారు. అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట ఎస్ఐబీ మాజీ చీఫ్ ను హాజరు పరచనున్నారు. ఫిజికల్ గా టార్చర్ చేయవద్దని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో గత బీఆర్‌ఎస్ హయాంలో ప్రతిపక్ష నాయకులు, నటీనటులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలతో సహా పలువురి ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసింది. దర్యాప్తులో భాగంగా ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) మాజీ అధికారులు ప్రవీణ్ రావు, నల్లమాసు శివశంకర్, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న వంటి కీలక పోలీసు అధికారులను అరెస్ట్ చేసి విచారించారు.
ఈ కేసులో అత్యంత కీలకమైన నిందితుడు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావుపైనే ప్రస్తుతం దర్యాప్తు కేంద్రీకృతమై ఉంది. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. అయితే, దర్యాప్తునకు సహకరించడం లేదన్న వాదనలు, సాక్ష్యాల ధ్వంసం ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఆయనకు కల్పించిన అరెస్ట్ రక్షణను తొలగించి, వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. ప్రభాకర్ రావు కస్టడీ విచారణకు సహకరిస్తే, ట్యాపింగ్ నెట్‌వర్క్ డొంక మరింత కదిలి, ఈ వ్యవహారంలో ఉన్నతస్థాయి రాజకీయ ప్రముఖుల పాత్రలు బహిర్గతమవుతాయని భావిస్తున్నారు.
