తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో ఓ రోజు తాను ముఖ్యమంత్రి అవుతానని, అవకాశం వచ్చినప్పుడు తనపై బురద జల్లుతున్న వాళ్ల కాళ్లు విరగ్గొడతానని, వాళ్ల తోలుతీస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉంటే తన భర్త పేరు ఎప్పుడూ రాలేదని, ఇప్పుడు కొందరు ఉద్దేశపూర్వకంగా తనతో పాటు తన భర్త పేరు రాజకీయాల్లోకి లాగుతున్నారని కవిత మండిపడ్డారు. తాను ఢిల్లీలో పోరాటం చేస్తుంటే, బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కేసీఆర్ నీడలో ఏసీ రూముల్లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
దేవుడి దయవల్ల తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే ఖచ్చితంగా సీఎం అవుతానని.. అప్పుడు ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని, వాళ్ల కాళ్లు విరగ్గొడుతా, ఒక్కొక్కరి తోలు తీస్తానంటూ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి నన్ను వెళ్లగొట్టారు, ఇంకా మీ కళ్లు చల్లబడలేదా, మాపై ఎందుకీ కక్ష అని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో బీఆర్ఎస్ పాలన నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని అక్రమాలను బయటకు తీస్తానని హెచ్చరించారు. తనకో అవకాశం వస్తుందని, వాళ్ల లెక్కలు అప్పుడు తేలుస్తా అన్నారు.
తనపై ఆరోపణలు చేస్తున్న వారికి మాజీ ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపినట్లు కవిత తెలిపారు. తనపై, తన భర్త అనిల్‌పై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని, అందుకుగానూ వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారికి పంపిన నోటీసులలో కవిత డిమాండ్ చేశారు. “దమ్ముంటే నేను చేసిన ఆరోపణలకు జవాబు చెప్పండి. అంతేకానీ, నేను చేసిన ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు నాపై, నా భర్త గురించి ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు” అని కవిత పేర్కొన్నారు.
