మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు మాచర్లలోని న్యాయమూర్తి ఎదుట కొద్దిసేపటి క్రితం లొంగిపోయారు (సరెండర్ అయ్యారు). సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారు న్యాయమూర్తి ఎదుట హాజరు కాగా, వారి తరపు న్యాయవాదులు కోర్టులో సరెండర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇటీవల మాచర్లలో జరిగిన జంట హత్యల కేసుతో సహా పలు కేసులలో వీరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ లొంగుబాటు జరిగింది.
పిన్నెల్లి సోదరులు లొంగిపోయిన నేపథ్యంలో, మాచర్ల న్యాయస్థానం ఎదుట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మాచర్ల పట్టణంలో 144వ సెక్షన్ విధించారు. కోర్టు పరిసరాల్లో ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు. న్యాయమూర్తి తదుపరి ఆదేశాల మేరకు పోలీసులు పిన్నెల్లి సోదరులపై చర్యలు తీసుకుంటున్నారు.
కోర్టులో ప్రక్రియ పూర్తయిన తర్వాత, న్యాయస్థానం పక్కనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిన్నెల్లి సోదరులకు వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ వైద్య పరీక్షల అనంతరం వారిని జైలుకు తరలించే అవకాశముందని సమాచారం. ఈ మొత్తం ప్రక్రియ ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా జరిగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తున్నారు.
