అమరావతి రియల్ ఎస్టేట్ స్తబ్దత: ధరలు పడిపోవడానికి కారణం ఇదేనా?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల కారణంగా అమరావతి ప్రాంతంలోని భూముల విలువ తిరిగి పడిపోయి, రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొందని స్థానిక రైతులు, రియల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2014లో అమరావతి రాజధానిగా ప్రకటించిన సమయంలో ఎకరం ధర రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు పెరిగి, రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. అయితే, 2019 ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తేవడంతో భూమి ధరలు తిరిగి రూ.40 లక్షలకు పడిపోయాయి.

అయితే, చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత, ఆయన అనుసరిస్తున్న పద్ధతులు, వరుసగా భూ సమీకరణలు చేస్తుండటం వల్ల రియల్ ఎస్టేట్ తిరిగి స్తబ్దతకు గురైందని చెబుతున్నారు. మొదటి విడత ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చిన ప్లాట్లను ఇంతవరకూ అభివృద్ధి చేయకుండానే, ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణకు వెళ్లడం, మూడో విడత కూడా ఉంటుందని చెప్పడంతో భూముల ధరలు తిరిగి ఢమాల్ అంటున్నాయనే ఆవేదన రైతులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాజధాని హైప్ చూసి భూమిని కొనుగోలు చేసిన వారు ఇప్పుడు అమ్మాలన్నా కొనేవారు లేరని వాపోతున్నారు.

ఒక వీధిలో ఒక షాపు ఉంటే గిరాకీ ఉంటుందని, అదే వీధిలో మరొక షాపు ఏర్పాటైతే గిరాకీ తగ్గిపోతుందని ఒక రైతు ఉదాహరణ చెప్పారు. అలాగే, తమ ప్లాట్లను అభివృద్ధి చేయకుండానే మరొకరికి ప్లాట్లు కేటాయించడంతో భూముల ధరలు తగ్గిపోయాయని, ఇది తమకు అన్యాయమని రైతులు చెబుతున్నారు. తాము రాజధానికి వ్యతిరేకం కానప్పటికీ, తమకు ప్లాట్లను అభివృద్ధి చేయకుండానే మరొకసారి భూ సమీకరణకు వెళ్లడంపై వారు అసంతృప్తిగా ఉన్నారు. దీనిపై జేఏసీ నేతలతో మాట్లాడినా ఫలితం లేదని, గ్రామ సభలు జరిపి రైతుల అభిప్రాయాలను సేకరించాలని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

Posted Under AP
Editor