హైదరాబాద్ నగరంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా, కొత్వాల్‌గూడలోని ఎకో పార్క్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలోని హిమాయత్‌సాగర్ పక్కన 85 ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌ఎండీఏ ఈ పార్కును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసింది. ఈ ఎకో పార్కులోనే దేశంలోనే అతి పెద్ద పక్షి శాల మరియు అతి పెద్ద ఎక్వేరియం కూడా ఏర్పాటు చేశారు.
ఈ పక్షి శాల వివిధ దేశాల నుంచి తీసుకొచ్చిన దాదాపు 1,500 రకాల పక్షులకు నిలయంగా ఉంది. ఈ కేంద్రం బర్డ్ వాచింగ్, నేచర్ ఎడ్యుకేషన్, మరియు పక్షులపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లతో రూపొందించబడింది. ఇందులో బ్లూ అండ్ గోల్డ్ మేకా, గ్రీన్ వింగ్ మేకా, స్కార్లెట్ మేకా వంటి రంగురంగుల మేకా పక్షులు, అలాగే కాకాటో, ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ వంటి తెలివైన చిలుకల జాతులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
పిల్లలు, పెద్దలు వారాంతాల్లో ఆహ్లాదంగా గడిపేందుకు వీలుగా ఈ పార్కులో అనేక సాహస క్రీడలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో జిప్ లైన్, క్లైంబింగ్ వాల్, స్కై బ్రిడ్జి, రోలర్ కోస్టర్, జాయింట్ స్వింగ్, 360 డిగ్రీస్ ఫ్లయింగ్ సైకిల్, సస్పెన్షన్ బ్రిడ్జి, బంగీ ట్రంప్ లైన్ వంటి విభిన్న క్రీడలు ఉన్నాయి. ఈ పార్కు అన్ని సౌకర్యాలతో పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తూ నగరానికి మరో కొత్త పర్యాటక కేంద్రంగా మారింది.
