భారీ సంక్షోభంలో ఇండిగో: ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు, డీజీసీఏ ఆంక్షలు, వ్యూహాత్మక ఆరోపణలు

భారతదేశంలో చౌకధరల విమానయాన సంస్థగా పేరున్న ఇండిగో (InterGlobe Aviation) గత నాలుగు రోజులుగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. దేశీయ సర్వీసుల్లో నెలకొన్న అంతరాయం కారణంగా వందలాది విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. సిబ్బంది కొరత, పైలట్లకు శిక్షణపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విధించిన కొత్త ఆంక్షలు ఇండిగో సర్వీసులకు అడ్డంకులుగా ఉన్నాయని కంపెనీ వాదిస్తోంది. ఈ సమస్య కారణంగా ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు పడి, తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

DGCA విధించిన కొత్త నిబంధనల్లో ముఖ్యంగా ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) మార్పులు ఉన్నాయి, దీనిలో పైలట్లకు వీక్లీ రెస్ట్ సమయాన్ని 36 నుంచి 48 గంటలకు పెంచారు. ఈ కఠిన నిబంధనలు పైలట్ల అలసట సమస్య పరిష్కారానికి ఉద్దేశించినవైనప్పటికీ, ఇండిగోకు తగినంతమంది శిక్షణ పొందిన పైలట్లు లేకపోవడంతో, సిబ్బంది కొరత ఏర్పడింది. అయితే, కంపెనీ వ్యూహాత్మకంగా అంతర్జాతీయ సర్వీసులను మినహాయించి, ఆదాయం తక్కువగా ఉంటుందనే సాకుతో కేవలం దేశీయ సర్వీసులపైనే రద్దులు విధించిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

ఇండిగో సర్వీసుల అంతరాయం ఇప్పుడు దేశంలోని మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌తో సహా అనేక ప్రాంతాల్లోని ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. దీని కారణంగా రౌండ్‌ట్రాప్ టికెట్ ధరలు ఒక్కసారిగా రూ. 20 వేల నుంచి రూ. 92 వేల వరకూ పెరిగాయి. పౌర విమానయాన చరిత్రలో ఇంత భారీ స్థాయిలో విమాన సర్వీసులు రద్దు కావడం ఇదే మొదటిసారి కావడంతో, ఈ సమస్య శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలకు పెద్ద అస్త్రంగా మారింది. ఆలస్యంగానైనా, ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించడం కొంత ఊరటనిచ్చే అంశం.

Editor