టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన పనిలేదు: వచ్చే ఏడాది నుంచి కొత్త టోల్ విధానం – కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ!

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే ఏడాది (2026) నుంచి దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన పనిలేకుండా కొత్త టోల్ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో ప్రకటించారు. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే, టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిలబడకుండా, రయ్.. రయ్.. మంటూ వెళ్లిపోవచ్చని ఆయన తెలిపారు.

వచ్చే ఏడాది కొత్త టోల్ విధానం దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. దీని ప్రకారం, వాహనం టోల్ ప్లాజాను దాటిన వెంటనే, యూజర్ యొక్క బ్యాంకు అకౌంట్ నుంచి టోల్ మొత్తం ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. ఈ టోల్ విధానం కూడా ఇప్పటికే అమలులో ఉన్న ఫాస్టాగ్ (FASTag) ద్వారానే పనిచేస్తుంది. దీని కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్తగా ఎన్‌ఈటీసీ (NETC) కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని నితిన్ గడ్కరీ చెప్పారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల కోట్ల విలువైన 4,500 హైవే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించి, సమయాన్ని ఆదా చేయడంతో పాటు, టోల్ వసూళ్లలో పారదర్శకతను పెంచడం ఈ కొత్త విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కొత్త సాంకేతికతతో టోల్ గేట్ల వద్ద వేచి ఉండే సమయం పూర్తిగా తగ్గుతుందని భావిస్తున్నారు.

Editor