హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ: ‘బూటకపు ఎన్‌కౌంటర్, కలప వ్యాపారులే ద్రోహం చేశారు’

మావోయిస్టు అగ్ర నాయకుడు హిడ్మా ఎన్‌కౌంటర్ పై మావోయిస్టు పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌ పూర్తిగా బూటకమని (Fake Encounter), అనారోగ్యంతో ఉన్న హిడ్మా మరియు శంకర్‌లు చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో మావోయిస్టు పార్టీ విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు కలప వ్యాపారులతో కలిసి వెళ్లిన హిడ్మా, శంకర్‌లను ఆ వ్యాపారులు ఇచ్చిన సమాచారం మేరకే పోలీసులు పట్టుకున్నారని మావోయిస్టులు ఆరోపించారు. కొందరు కలప వ్యాపారులు ద్రోహం చేయడం వల్లే వారు భద్రతా బలగాలకు చిక్కారని లేఖలో తెలిపారు. దొరికిన తర్వాత వారం రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి హిడ్మాను పోలీసులు చంపేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.

హిడ్మా హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని మావోయిస్టు పార్టీ ఈ లేఖ ద్వారా డిమాండ్ చేసింది. బూటకపు ఎన్‌కౌంటర్ అని ఆరోపించడం, కలప వ్యాపారుల ద్రోహం గురించి లేఖలో ప్రస్తావించడం వంటి అంశాలు ఈ ఘటనపై మరింత ఉత్కంఠను పెంచాయి. ఈ లేఖ విడుదలైన నేపథ్యంలో, దీనిపై భద్రతా సంస్థలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.

Editor