Latest Posts

భారత యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ ఆస్కార్ బరిలో: పాకిస్థాన్‌లోనూ ప్రత్యేక ప్రదర్శన!

భారీ తారాగణం మరియు ప్రచార ఆర్భాటం లేకుండానే బాక్సాఫీస్ వద్ద ₹300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన భారతీయ యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుతోంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆధునిక యానిమేషన్ టెక్నాలజీని ఉపయోగించి నరసింహ పురాణంలోని ఘట్టాలను అద్భుతంగా చూపించడంతో విడుదలైన తొలి రోజు నుంచే ఈ చిత్రం మౌత్ టాక్‌తో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

‘మహావతార్ నరసింహ’ చిత్రం 98వ ఆస్కార్ అవార్డుల కోసం ‘ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్’ కేటగిరీలో పోటీ పడుతున్న 35 చిత్రాల ప్రాథమిక జాబితాలో చోటు దక్కించుకుంది. జనవరి 22న ప్రకటించే తుది నామినేషన్లలో ఈ చిత్రం ఎంపికైతే, ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ యానిమేషన్ చిత్రంగా చరిత్ర సృష్టిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రం రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది.

ఈ చిత్రం ఇటీవల పాకిస్థాన్‌లోని కరాచీ స్వామి నారాయణ దేవాలయంలో హిందువుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించబడటం విశేషం. ఈ ప్రదర్శనకు వందలాది మంది పాకిస్థానీ హిందువులు తరలివచ్చి, నరసింహస్వామి కథను చూసి భావోద్వేగానికి గురయ్యారు. పురాణాల ప్రకారం, హిరణ్యకశ్యపుడి స్వస్థలం నేటి పాకిస్థాన్‌లోని ముల్తాన్ అని, నరసింహావతారం అక్కడే జరిగిందని స్థానిక పండితులు చెప్పడం ఈ సందర్భంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Editor