Latest Posts

ఓటర్ల జాబితా సమీక్ష ఒత్తిడి: బీఎల్‌ఓల వరుస ఆత్మహత్యలు, గుండెపోటు మరణాలు – కన్నీళ్లు పెట్టిస్తోన్న సూసైడ్ నోట్

కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష (SIR) ప్రక్రియపై విపక్షాల విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో, పని ఒత్తిడి కారణంగా పలువురు బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO) మరణించడం కలకలం రేపుతోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో తాజాగా మరో బీఎల్ఓ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. మరొకరు గుండెపోటుతో మరణించారు. ఎస్ఐఆర్ పనిభారమే తమవారి మరణాలకు కారణమని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నప్పటికీ, అధికారులు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.

మొరాదాబాద్‌కు చెందిన అసిస్టెంట్ టీచర్, బీఎల్ఓ సర్వేష్ సింగ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన సూసైడ్ నోట్‌లో, “రాత్రులు గడవవు.. పగలు మనశ్శాంతి ఉండదు.. నాకు బతకాలని ఉంది.. కానీ ఏం చేయగలను? ఈ అశాంతితో ఊపిరాడని ఈ పరిస్థితుల్లో నాలో నేను భయపడుతున్నాను” అని ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ ప్రక్రియ అర్థం కాకపోవడం, రోజువారీ లక్ష్యాలు పూర్తి చేయలేక క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారేమోనన్న అధికారుల నిరంతర హెచ్చరికల భయమే తన భర్త మరణానికి కారణమని ఆయన భార్య కన్నీళ్లు పెట్టుకున్నారు.

పని ఒత్తిడి కారణంగానే బిజినోర్‌కు చెందిన 56 ఏళ్ల బీఎల్ఓ శోభా రాణి గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుమారుడు తెలిపారు. 1,003 ఫారాలను పూర్తి చేయాలనే టార్గెట్ కోసం అనారోగ్యం ఉన్నప్పటికీ ఆలస్యంగా నిద్రపోయేవారని వివరించారు. ఇదే విధంగా, ఫతేపూర్‌కు చెందిన బీఎల్ఓ సుధీర్ కుమార్ కురిల్ తన పెళ్లికి ముందు రోజు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. టార్గెట్ పూర్తి చేయకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని అధికారులు బెదిరించారని ఆయన సోదరి ఆరోపించారు. పలువురు బీఎల్ఓలు గుండెపోటు, మెదడు రక్తస్రావం వంటి కారణాలతో మరణించగా, ఈ ఘటనలపై ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ ఎటువంటి స్పందన ఇవ్వలేదు.

Editor