తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్‌లో జరిగిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల’ సభలో మాట్లాడుతూ, మక్తల్–నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు పనులు రెండేళ్లలో పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లు, అధికారుల వీపు విమానం మోత మొగుతదని తీవ్రంగా హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు మొదలుపెట్టిందని, పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందించే బాధ్యత తనదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా మక్తల్‌లో రూ.270 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీటిలో జూరాల వద్ద హై లెవెల్ బ్రిడ్జ్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, రోడ్డు విస్తరణ పనులు ఉన్నాయి. విద్య, సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఈ నెల 8, 9 న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహిస్తున్నామని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఏకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
గత పదేళ్ల పాలనలో కేసీఆర్ సంగం బండను పగలగొట్టేందుకు రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అందిస్తోందని వివరించారు. పంచాయతీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో, ప్రజలు కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను కాకుండా, మంచివారిని ఎన్నుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. “మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది, నీళ్లు ఇచ్చే బాధ్యత నాది” అని హామీ ఇచ్చారు.
