మంతెన వారి వివాహ వేడుకల్లో జెన్నిఫర్ లోపేజ్ ప్రదర్శన: భారీ పారితోషికం

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్లో ఇటీవల భారత సంతతి అమెరికన్ బిలియనీర్, అమెరికా ఫార్మా ఇండస్ట్రీలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన మంతెన రామరాజు కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రామరాజు కుమార్తె నేత్ర మంతెన, వంశీ గాదిరాజుల వివాహానికి దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ కూడా ఈ వేడుకలో పాల్గొనడం విశేషం. ఈ వివాహ వేడుకల్లో భాగంగా పలువురు హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ప్రదర్శనలను ఏర్పాటు చేశారు.

ఈ వేడుకల్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అమెరికన్ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్ (JLo) ప్రదర్శన ఇచ్చారు. అయితే, ఈ ఒక్క ప్రదర్శనకు జెన్నిఫర్ లోపేజ్ ఏకంగా రూ. 17 కోట్లు పారితోషికం అందుకున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా జెన్నిఫర్ లోపేజ్ భారతదేశంలో జరిగిన పలు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.

2015లో ఉదయ్‌పూర్‌లోనే జరిగిన సంజయ్ హిందూజా వివాహ వేడుకలకు జెన్నిఫర్ లోపేజ్ హాజరై ప్రదర్శన ఇచ్చారు. ఆ సమయంలో ఆ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చినందుకు గానూ జెన్నిఫర్ రూ. 6.5 కోట్ల రూపాయలు ఛార్జ్ చేశారని సమాచారం. ఈ తాజా వివాహ వేడుకల్లో జెన్నిఫర్ లోపేజ్‌తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ప్రదర్శనలు ఇచ్చారు.

Editor