తెలంగాణ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి అంటే ఈ నెల 27వ తేదీ నుంచి మొదలు కానుంది. తొలి విడత నామినేషన్లను రేపటి నుంచి స్వీకరించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నామినేషన్లు వేసే అభ్యర్థులు కచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను పాటించకపోతే, స్క్రూటినీలో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది.
నామినేషన్ దాఖలుకు ప్రధాన నిబంధనలు:
-
నామినేషన్ వేసే వ్యక్తికి 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
-
అభ్యర్థి మరియు ప్రతిపాదకుడు సంతకం చేసిన నామినేషన్‌ను ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలి.
-
ప్రతిపాదకుడు కచ్చితంగా సంబంధిత వార్డు ఓటరు జాబితాలో నమోదు అయి ఉండాలి, అలాగే అభ్యర్థి కూడా ఆ గ్రామంలో ఓటరుగా నమోదు అయి ఉండాలి.
-
అభ్యర్థి మరియు ప్రతిపాదకుడు ఇంటి పన్ను (House Tax) కట్టి, గ్రామ పంచాయతీ నుండి నో డ్యూ సర్టిఫికెట్ (No Due Certificate) తీసుకోవాలి.
డిపాజిట్ రుసుము మరియు రిజర్వ్‌డ్ కేటగిరీ నిబంధనలు:
-
సాధారణ అభ్యర్థులకు డిపాజిట్ రుసుము: సర్పంచ్ అభ్యర్థికి రూ. 2,000, వార్డు అభ్యర్థికి రూ. 500.
-
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి లేదా నామినేషన్ ఫారంలోని పార్ట్_III లో డిప్యూటీ తహసీల్దార్ సంతకం చేయించాలి.
-
రిజర్వుడు కేటగిరి అభ్యర్థుల డిపాజిట్ రుసుము: సర్పంచ్ అభ్యర్థికి రూ. 1,000, వార్డు అభ్యర్థికి రూ. 250.
-
అభ్యర్థి ఎన్నికల ఖర్చు ఖాతా నిర్వహిస్తానని చెప్పే డిక్లరేషన్‌పై రిటర్నింగ్ అధికారి సమక్షంలో సంతకం చేసి ఇవ్వాలి. అలాగే, స్క్రూటినీ రోజున నిర్ణీత సమయానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఎదురుగా తప్పనిసరిగా హాజరు కావాలి.
