డిజిటల్ యుగంలో ప్రతి పౌరుడు సురక్షితంగా ఉండటం అత్యంత ముఖ్యమని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ప్రపంచంలో వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఫోటోలు అన్నీ విలువైన డేటాగా మారాయని, చిన్న పొరపాటు లేదా నిర్లక్ష్యం కూడా డేటా దోపిడీకి దారితీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. “మీ డేటాని కాపాడేది ముందుగా మీరు” అంటూ X ప్లాట్‌ఫారమ్‌లో ప్రజలకు అవగాహన కల్పించారు.
సైబర్ మోసాలు మరియు డేటా చోరీ ఘటనలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి అని సీపీ సూచించారు. ఓటీపీ స్కామ్‌లు, ఫిషింగ్ మెసేజ్‌లు, ఫేక్ యాప్‌లు, సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్ వంటి ఘటనలు ప్రతిరోజూ పెరుగుతున్నాయని తెలిపారు. ఒకసారి డేటా దొంగిలించబడితే, అది వ్యక్తిగతంగానే కాకుండా ఆర్థికంగా కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయవద్దని, తెలియని కాల్స్/మెసేజ్‌లకు స్పందించవద్దని, సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పంచవద్దని ఆయన సూచించారు.
ఒకవేళ డేటా చోరీ జరిగినా లేదా ఆన్‌లైన్ మోసానికి గురైనా ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సజ్జనార్ హెచ్చరించారు. ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగితే, డబ్బును ఫ్రీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వెంటనే జాతీయ సైబర్ సెక్యూరిటీ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయాలని కోరారు. అలాగే, ఆన్‌లైన్ మోసానికి గురైనట్లు అనిపిస్తే, cybercrime.gov.in అనే అధికారిక పోర్టల్‌లో వెంటనే ఫిర్యాదు నమోదు చేయాలని ఆయన సూచించారు.
