తెలంగాణ డ్వాక్రా మహిళలకు శుభవార్త: రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాల విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలను (SHG) ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క, ములుగు జిల్లా ఏటూరు నాగారం నుంచి పాల్గొని, రాష్ట్రంలోని 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని నేరుగా జమ చేసినట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు సుమారు రూ. 3,500 కోట్ల వడ్డీ బకాయిలను చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిందని, దీనివల్ల మహిళలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. అంతేకాక, మహిళల కష్టార్జితమైన అభయహస్తం నిధులను కూడా గత ప్రభుత్వం వినియోగించుకుందని మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని స్పష్టం చేస్తూ, మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని ఆమె వివరించారు.

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా కనీసం రూ. 25,000 కోట్లకు తగ్గకుండా బ్యాంకు లింకేజీ రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ నిధులు మహిళా స్వయం సహాయక సంఘాలు తమ వ్యాపారాలు, కార్యకలాపాలను విస్తరించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. సకాలంలో వడ్డీ లేని రుణాలు అందడం వల్ల గ్రామీణ మహిళలు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించుకోవడానికి, ఆర్థికంగా స్థిరపడటానికి వీలు కలుగుతుందని, ఇది వారి జీవితాల్లో గణనీయమైన సానుకూల మార్పు తీసుకువచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Editor