ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల దేవుడిపై తనకు నమ్మకం లేదంటూ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఆయన భవిష్యత్‌లో దేవుడిని నమ్మేలా చూడాలని కోరారు. ఈ వ్యాఖ్యలను ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, అర్బన్ నక్సల్స్ మరియు కమ్యూనిస్టు పార్టీలపై నిప్పులు చెరిగే సందర్భంగా ప్రస్తావించారు. “భవిష్యత్తులో రాజమౌళి దేవుడిని నమ్మేలా చూడాలని, ఆయన బాగుండాలని కోరుకుంటున్నాను” అని బండి సంజయ్ అన్నారు.
అర్బన్ నక్సల్స్ మరియు కమ్యూనిస్టులపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏసీ రూముల్లో కూర్చుని బూటకపు ఎన్‌కౌంటర్ల గురించి మాట్లాడేవారు, అమాయకులను రెచ్చగొట్టి ఆయుధాలు చేతపట్టించి వారి చావులకు కారకులవుతున్నారని ప్రశ్నించారు. ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడాలని ఆందోళనలు చేస్తూ, మరోవైపు అదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా నక్సలిజంలో చేరాలని రెచ్చగొట్టడం ద్వంద్వ నీతి అని ఆయన విమర్శించారు. వారికి ఏమాత్రం నైతికత ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకున్న పదవులకు రాజీనామా చేసి వాస్తవాలు మాట్లాడాలని డిమాండ్ చేశారు.
తాము బ్యాలెట్‌ను నమ్ముకుని కేంద్రంలో అధికారంలోకి వచ్చామని, వికసిత్ భారత్ దిశగా లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని బండి సంజయ్ స్పష్టం చేశారు. తమ లక్ష్యం 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా మార్చడమేనని తెలిపారు. మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు అర్బన్ నక్సల్స్‌కు కనిపించడం లేదని ఆక్షేపించారు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతివ్వడాన్ని స్వాగతిస్తూ, అవినీతికి పాల్పడే వారిని మోదీ ప్రభుత్వం సహించదని, కచ్చితంగా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
