కవిత వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల కౌంటర్: బీఆర్‌ఎస్ నేతలకు ప్రశ్న

బీఆర్‌ఎస్ నాయకులు తమ ఇంటి ఆడబిడ్డ కవిత అడిగే ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ పెద్దలు తమ ఇంట్లో కుంపటిని రాష్ట్రమంతటా పెట్టవద్దని ఆయన హితవు పలికారు. ఇటీవల జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటించిన కవిత, సీనియర్ నాయకుడైన తుమ్మల నాగేశ్వరరావు వంటి వారిని వదులుకోవడం కేసీఆర్ చేసిన తప్పని, ఆ ప్రభావం వల్లే బీఆర్‌ఎస్ ఓడిపోయిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత వ్యాఖ్యల నేపథ్యంలోనే తుమ్మల ఈవిధంగా స్పందించారు.

దీంతో పాటు, తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. పత్తి కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిని ప్రస్తావిస్తూ, ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పత్తి కొనుగోలు చేయాలని చెబుతుంటే, మరోవైపు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నిబంధనలతో రైతులను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు.

అయినా, దేశంలో మరెక్కడా లేని విధంగా **ఎంఎస్‌పీ (కనీస మద్దతు ధర)**కి పంటలు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తుమ్మల నొక్కి చెప్పారు. పత్తి కొనుగోలుకు సంబంధించి, 20 శాతం వరకు తేమ ఉన్నా కొనుగోలు చేయాలని సీసీఐకి చెప్పినట్లు తెలిపారు. అంతేకాకుండా, పత్తి కొనుగోలులో విధించిన ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి అనే నిబంధనను తక్షణమే ఎత్తివేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Editor