నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘NBK111’ కు సంబంధించి చిత్ర యూనిట్ ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది. మంగళవారం నాడు లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజును పురస్కరించుకుని, ఈ సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ, “క్వీన్ నయనతార గారికి NBK111 ప్రపంచంలోకి స్వాగతం. మా కథలో ఆమె శక్తి, గాంభీర్యం ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నాం,” అని పేర్కొన్నారు.
‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలిసి పనిచేస్తున్న రెండో సినిమా ఇది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం చారిత్రక కథాంశంతో రూపొందుతోంది. బాలకృష్ణ ఇందులో మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించనున్నట్లు సమాచారం. ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జైసింహా’ వంటి ఘన విజయాలు సాధించిన బాలయ్య-నయనతారల కాంబినేషన్ మళ్లీ తెరపైకి వస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను నవంబర్‌లోనే లాంఛనంగా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ కోసం రాజస్థాన్‌లోని పలు లొకేషన్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. నయనతార పుట్టినరోజున ఈ కీలక ప్రకటన రావడం బాలయ్య మరియు నయనతార అభిమానులకు ప్రత్యేక సంతోషాన్ని ఇచ్చింది.
