ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఎర్రచందనం స్మగ్లర్లపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శనివారం తిరుపతి జిల్లాలో పర్యటించిన ఆయన, మామండూరు అటవీ ప్రాంతంతో పాటు మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ, ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఇప్పటికే నలుగురు కింగ్‌పిన్‌లను గుర్తించినట్లు వెల్లడించారు. “ఒకసారి ఆపరేషన్ మొదలుపెడితే వెనుదిరిగే ప్రసక్తే ఉండదు” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు, స్మగ్లర్ల ఆట కట్టించడానికి ‘ఆపరేషన్ కగార్’ను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు దాదాపు 2 లక్షల ఎర్రచందనం చెట్లను నరికి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రచందనం చెట్టుకు వేంకటేశ్వరస్వామి గాయం నుంచి పుట్టిన గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉందని గుర్తుచేశారు. ఈ అక్రమ రవాణాను పూర్తిగా కట్టడి చేసేందుకు గాను, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కోరినట్లు తెలిపారు.
ఎర్రచందనం స్మగ్లర్లు స్వచ్ఛందంగా తమ అక్రమ కార్యకలాపాలను ఆపకపోతే, అటవీ చట్టం ప్రకారం వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని మంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఈ అక్రమ నరికివేతలో స్థానిక ప్రజలు, తమిళనాడు కూలీలు భాగస్వాములు కావొద్దని విజ్ఞప్తి చేస్తూ, ఎర్రచందనాన్ని కాపాడే బాధ్యత వేంకటేశ్వరస్వామి భక్తులపై కూడా ఉందని ఆయన గుర్తుచేశారు.
