ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చింతకుంట గ్రామ సమీపంలో గురువారం ఒక ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. పుట్లూరు నుంచి చింతకుంట వైపు ప్రయాణిస్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, బస్సు స్టీరింగ్ ఒక్కసారిగా స్టక్ కావడంతో డ్రైవర్‌కు నియంత్రణ తప్పింది. బస్సు రోడ్డును దాటి బయటికి వెళ్లినప్పటికీ, అదృష్టవశాత్తూ రోడ్డు పక్కన ఉన్న మైదానంలో ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎక్కువగా స్థానిక ఆదర్శ పాఠశాల, జడ్పీ పాఠశాల విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు స్కూల్‌కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పడంతో ప్రయాణికులు, విద్యార్థులు భయంతో అరుస్తూ గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే, డ్రైవర్ ధైర్యం కోల్పోకుండా, సమయోచితంగా వ్యవహరించడం వల్లే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారని ప్రయాణికులు చెబుతున్నారు.
ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బస్సులో ఉన్న విద్యార్థులు, ప్రయాణికులు అందరూ క్షేమంగా బయటపడటంతో స్థానికులు మరియు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు వెంటనే మరో బస్సు ఏర్పాటు చేసి విద్యార్థులను వారి గమ్యస్థానాలకు పంపించారు. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు విచారణ ప్రారంభించారు. బస్సు సాంకేతిక లోపం కారణమా లేక మానవ తప్పిదమా అనేది తెలుసుకునేందుకు పరిశీలిస్తున్నారు.
