తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు, ప్రసాదరావు అలియాస్ చంద్రన్న (కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు) మరియు బండి ప్రకాశ్ (రాష్ట్ర కమిటీ సభ్యుడు) లొంగిపోయారు. తెలంగాణ ఎస్ఐబి (SIB) కీలక ఆపరేషన్ నిర్వహించగా, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చంద్రన్న అజ్ఞాతం వీడినట్లు డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. అనారోగ్య పరిస్థితులు మరియు ఆపరేషన్ ‘కగార్’ వంటి కారణాల వల్ల తాము జనజీవన స్రవంతిలోకి వస్తున్నామని, అయితే ఇది లొంగుబాటు కాదని, రాబోయే రోజుల్లో ప్రజల కోసమే పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. తాము ఎలాంటి డబ్బు ఆశించడం లేదని, తమ సిద్ధాంతం ఓడిపోలేదని, భవిష్యత్తులో మరింత మంది తమ భావజాలంతో ముందుకు వచ్చే అవకాశం ఉందని నక్సల్స్ నేతలు తెలిపారు.
లొంగిపోయిన నేతలు మావోయిస్టు పార్టీలో అంతర్గత చీలికలు ఉన్నాయని వెల్లడించారు. దేవోజి సీపీఐ మావోయిస్టు కార్యదర్శిగా ఉన్నారని, కానీ తాము వేరే మార్గాన్ని ఎంచుకున్నామని చంద్రన్న, బండి ప్రకాష్ తెలిపారు. సోని వర్గం తమను వ్యతిరేకిస్తోందని, అయినప్పటికీ తమకు ప్రజల మధ్య పనిచేసే క్యాడర్ ఉందని, దేశమంతా పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉద్యమంలో పీడిత ప్రజల కోసమే పని చేశామని, భవిష్యత్తులో కూడా ప్రజల కోసమే పని చేస్తామని, ఆయుధాలను పార్టీకి అప్పగించే వచ్చామని నొక్కి చెప్పారు.
లొంగిపోయిన చంద్రన్న (పుల్లూరి ప్రసాద్ రావు)ది పెద్దపల్లి మండలం. ఆయన 15 ఏళ్ల పాటు కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 1980లో కిషన్ జీకి కొరియర్‌గా ప్రస్థానం ప్రారంభించిన చంద్రన్న, 2008లో కేంద్ర కమిటీ సభ్యుడిగా, 2024 డిసెంబర్ వరకు తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా పనిచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ 21న ఇచ్చిన పిలుపు మేరకు చంద్రన్న అనారోగ్య కారణాల వల్ల అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిశారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా, ఇతర మావోయిస్టులు కూడా అజ్ఞాతం వీడి సరెండర్ కావాలని డీజీపీ పిలుపునిచ్చారు.
