Latest Posts

జాతీయ రహదారి 44: 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ విషాదం రిపీట్

కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సులో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం, సరిగ్గా 12 సంవత్సరాల క్రితం పాలెం వద్ద జరిగిన దుర్ఘటనను గుర్తు చేసింది. ఈ రెండు ప్రమాదాలు కూడా నేషనల్ హైవే 44 (NH 44) పైనే జరిగాయి, ఇందులో ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. చిన్నటేకూరు వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు బైకర్ శివశంకర్‌తో సహా 20 మంది మరణించారు, మరో 23 మంది క్షేమంగా బయటపడ్డారు.

సరిగ్గా 12 ఏళ్ల క్రితం, 2013 అక్టోబర్ 30న మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ప్రమాదానికి గురైంది. ఆ బస్సు కారును ఓవర్‌టేక్ చేస్తుండగా అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంక్ లీకై పేలుడు సంభవించింది. ఆ దుర్ఘటనలో మొత్తం 45 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి సీఐడీ విచారణలో, వోల్వో బస్సుల తయారీలో లోపాలు ఉన్నాయని, టైర్లకు సమీపంలో ఇంధన ట్యాంకులు ఉండటం, నిబంధనలకు విరుద్ధంగా సీట్లు పెంచడం వంటి కారణాలు ప్రమాదానికి దారితీశాయని నివేదిక సమర్పించారు.

ప్రస్తుతం, చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రమాద స్థలికి ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను ఫోరెన్సిక్ సిబ్బంది డీఎన్‌ఏ ద్వారా గుర్తించి కుటుంబాలకు అప్పగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Posted Under AP
Editor