గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ చిత్రం ‘పెద్ది’ తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ శ్రీలంకకు పయనమైంది. శ్రీలంకలోని అందమైన ప్రాంతాలలో కొన్ని రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ ఎయిర్‌పోర్ట్‌కు వెళుతున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
‘పెద్ది’ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ సినిమాకు స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడం ప్రత్యేక ఆకర్షణ. ఇటీవల వినాయక చవితి రోజున, మైసూరులో ఏకంగా 1000 మంది డ్యాన్సర్లతో రామ్ చరణ్‌పై ఒక భారీ పాటను చిత్రీకరించారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ కొత్త మేకోవర్‌లోకి మారినట్లు తెలుస్తోంది.
ఈ పాన్-ఇండియా చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఒక శక్తివంతమైన సహాయక పాత్రలో నటిస్తుండగా, జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు, షూటింగ్‌తో సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. ‘పెద్ది’ చిత్రాన్ని 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
