Latest Posts

‘నిజమే, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా.. అది అమ్మ శ్రీదేవి సలహా మేరకే’: జాన్వీ కపూర్ ఓపెన్

బాలీవుడ్ గ్లామరస్ నటి జాన్వీ కపూర్, తనపై చాలా కాలంగా ఉన్న ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్‌పై ఎట్టకేలకు బహిరంగంగా స్పందించింది. కాజోల్, ట్వింకిల్ హోస్ట్ చేసిన టాక్ షో “టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్” లో పాల్గొన్న జాన్వీ, తాను నిజంగా సర్జరీ చేయించుకున్నానని అంగీకరించింది. అయితే, ఈ సర్జరీ తన తల్లి, అతిలోక సుందరి శ్రీదేవి మార్గదర్శకత్వంలోనే జరిగిందని ఆమె వెల్లడించింది. తన తల్లి అనుభవం మరియు సూచనల కారణంగానే తాను తప్పులు చేయకుండా సరైన నిర్ణయాలు తీసుకోగలిగానని జాన్వీ వివరించింది.

జాన్వీ కపూర్ యువతులకు ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. తాను సర్జరీలు ఎంతవరకు చేయించుకున్నానో వెల్లడించకపోయినా, ఈ విషయంలో పారదర్శకత చాలా ముఖ్యమని నొక్కి చెప్పింది. యువతులు ఎవరైనా సోషల్ మీడియాలో ఒక అమ్మాయి వీడియో చూసి, అదే విధంగా సర్జరీ చేయించుకోవాలని అనుకుని ఏదైనా తప్పు జరిగితే, అది చాలా ప్రమాదకరం అవుతుందని ఆమె హెచ్చరిక జారీ చేసింది. అందుకే, తాను ఇప్పుడు పూర్తిగా ఓపెన్ బుక్‌గా ఉండాలని నిర్ణయించుకున్నానని, ఇకపై తాను తీసుకునే ఎలాంటి నిర్ణయాలైనా బహిరంగంగా చెబుతానని జాన్వీ స్పష్టంగా తెలిపింది.

సోషల్ మీడియాలో తన రూపం, శరీరం, దుస్తులు, బ్యూటీ ట్రీట్‌మెంట్‌లపై విమర్శలు ఎదుర్కొన్న జాన్వీ, తనలాంటి యువతులు తప్పుడు అంచనాలతో ముందుకు వెళ్లకుండా ఉండాలని కోరింది. “సోషల్ మీడియా మనసులను ప్రభావితం చేస్తుంది. అందుకే నిజం చెప్పడం చాలా అవసరం. మన శరీరాన్ని మనం అంగీకరించడం సిగ్గు కాదు” అని ఆమె పేర్కొంది. ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే, జాన్వీ కపూర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్న “పెద్ది” సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. అంతకుముందు ఆమె జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘దేవర’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

Editor