ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం దుబాయ్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులకు అండగా నిలిచేందుకు ‘ప్రవాసాంధ్ర భరోసా’ అనే ప్రత్యేక బీమా పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద దురదృష్టవశాత్తు ప్రవాసీయులు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందనుంది.
దుబాయ్ విమానాశ్రయంలో సీఎం చంద్రబాబుకు స్థానిక అధికారులు, ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. భారత కాన్సుల్ జనరల్ సతీశ్ కుమార్ శివన్, టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, దుబాయ్ నగర టీడీపీ అధ్యక్షుడు విశ్వేశ్వరరావుతో పాటు పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్ర మహిళలు కూడా తరలివచ్చి ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానించారు.
‘ప్రవాసాంధ్ర భరోసా’ పథకం ఆపదలో ఉన్న ప్రవాసీ కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తుందని టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ తెలిపారు. ఈ పథకం కష్టకాలంలో వారిని ఆదుకునేందుకే రూపొందించినట్లు ఆయన వివరించారు. సీఎం పర్యటన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ప్రవాసీయులతో భారీ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వివిధ గల్ఫ్ దేశాల నుంచి ప్రవాసాంధ్రులు దుబాయ్‌కు చేరుకుంటున్నారు.
