Latest Posts

కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు..! కదలికలపై పోలీసుల నిఘా..!

రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొడాలి నానిపై త్వరలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్‌ ఈ నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది. కొడాలి నానిపై అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా ఉంచాలంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

 

పలు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కొడాలి నానిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన అనారోగ్య సమస్యలను కారణంగా చూపి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. కొడాలి నాని విదేశాలకు వెళ్లకుండా నిరోధించాలని, తక్షణమే ఆయన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

 

టీడీపీ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొడాలి నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్‌ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నోటీసుల ప్రకారం విమానాశ్రయాలు, ఓడరేవులు, ఇతర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి, కొడాలి నాని దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకుంటారు. ఆయన కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతారు.

Posted Under AP
Editor