ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల (పరిషత్) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్ష అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేయకుండా అధికార కూటమి నేతలు అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), పోలీసు ఉన్నతాధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు రాలేదని, డీజీపీ అధికార పార్టీ చేతిలో తోలుబొమ్మలా మారారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తమ పాలనపై నమ్మకం ఉంటే అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లు అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన నేరుగా ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా 19 ప్రాంతాల్లో తమ పార్టీ అభ్యర్థులకు అడ్డంకులు సృష్టించారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినప్పటికీ, ఎస్ఈసీ కేవలం నాలుగు చోట్ల మాత్రమే గడువు పొడిగించి చేతులు దులుపుకుందని జగన్ ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారా లేక సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేస్తున్నారా అని నిలదీశారు. రాష్ట్రంలోని ఏకంగా 101 మండలాల్లో ఎంపీటీసీ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం, మరో 70 మండలాల్లో ఐదు కంటే తక్కువ నామినేషన్లు రావడం అధికార పార్టీ బెదిరింపులకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా నామినేషన్ కేంద్రాల వద్దే దాడులకు తెగబడుతున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల నిబంధనలను సీఎం చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని దుయ్యబట్టిన జగన్.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను అడ్డుకోవడం మాని, ప్రభుత్వం అమలు చేసిన పథకాల ఆధారంగా ఓట్లు అడగాలని హితవు పలికారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ ‘సూపర్ సిక్స్’, ‘సూపర్ సెవెన్’ హామీల వైఫల్యంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, ఆ భయంతోనే వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు చేయిస్తూ నామినేషన్ పత్రాలను చించేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను మీడియా సమావేశంలో ప్రదర్శించిన ఆయన.. ప్రజాస్వామ్యబద్ధంగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే విధుల్లో నిర్లక్ష్యం వహించి అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న అధికారులపై ఎస్ఈసీ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
