జ్యోతి మల్హోత్రా.. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పహల్గాం దాడి తర్వాత గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ ఆమె. ఏడాది క్రితమే ఈమె గురించి ఒక సామాన్య పౌరుడు సోషల్ మీడియాలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారుల్ని హెచ్చరించారు. ఈమె కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని, కాస్త దృష్టిపెట్టాలన్నారు. అధికారులు స్పందించలేదు, పహల్గాం అటాక్ తర్వాత జ్యోతి మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. గూఢచర్యం నిజమేనని తేలడంతో పోలీసులు అరెస్టే చేశారు. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన నిజాలు మరిన్ని బయటపడుతున్నాయి. జ్యోతి మామూలు గూఢచారి కాదు, దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించడానికి పాకిస్తాన్ అధికారులు ఆమెను వాడుకున్నారు, మన ఇంటెలిజెన్స్ కళ్లు తెరవకపోతే ఇంకా వాడుకుంటునే ఉండేవారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ పేరుతో ఆమె చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు, అవన్నీ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి.
3 నెలల ముందు రెక్కీ..
జ్యోతి సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అయ్యేవారికి ఈ విషయం బాగా అర్థమై ఉంటుంది. దాడి జరగడానికి ముందు ఆమె పహల్గాంలో పర్యటించింది. పహల్గాం అందాలన్నిటినీ వీడియో తీసింది. ఎక్కడెక్కడకు వెళ్లొచ్చు, ఏయే లొకేషన్లు బాగుంటాయి, ఎక్కడ ఫొటోలు దిగొచ్చు, ఎలాంటి సర్వీస్ లు అందుబాటులో ఉన్నాయనే విషయాలన్నీ అందులో పూసగుచ్చినట్టుగా చెప్పింది. పహల్గాం గురించి ఎంత చక్కగా వివరించింది అంటూ పర్యాటకులు ఆమెను మెచ్చుకుని ఉంటారు. కానీ ఆ వీడియో టార్గెట్ పర్యాటకులు కాదని, పాకిస్తాన్ లోని ఉగ్రవాదులనే అనే అనుమానాలు బలపడుతున్నాయి. అవును, పాక్ లోని ఉగ్రవాదులకు ఆ వీడియో ద్వారా అన్ని విషయాలను చేరవేసింది జ్యోతి మల్హోత్రా అంటున్నారు నెటిజన్లు. పహల్గాం ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడికి పర్యాటకులు వస్తారు, ఎక్కడ ఒంటరిగా ఉంటారు, అక్కడ రష్ ఎలా ఉంటుంది, ఏ ప్లేస్ లో అటాక్ జరిపితే బాగుంటుంది.. అనే వివరాలన్నీ ఆ వీడియో ద్వారా అప్పగించేసినట్టు స్పష్టమవుతోంది.
పహల్గాం అటాక్ తర్వాత వీడియోలు
పహల్గాం పర్యాటకం గురించి అంత బాగా మాట్లాడిన జ్యోతి, దాడి తర్వాత పర్యాటకుల్నే తప్పుబడుతో మరో వీడియో బయటకు వదిలింది. పర్యాటక ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అక్కడకు వెళ్లేవారిదేనంది. ఈ వీడియోలో ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినట్టు ఆమె మాట్లాడింది. అంటే ఒకరకంగా ప్రభుత్వానికి మద్దతిస్తూ, తనపై ఎవరికీ అనుమానం రాకుండా చూసుకుంది జ్యోతి. కానీ ఆమె కుట్రలు బయటపడ్డాయి.
జ్యోతి పాత్రపై పక్కా ఆధారాలు
జ్యోతి మల్హోత్రా విషయంలో అటు పోలీసులు, ఇటు ఆర్మీ పక్కా ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. వీరు సేకరించిన ఆధారాలకంటే సామాన్యులు, నెటిజన్లు కూడా జ్యోతి వ్యవహారాన్ని అన్ని వివరాలతో బయటపెడుతున్నారు. పహల్గాం అటాక్ తర్వాత ఒక వ్యక్తి ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయానికి కేక్ తీసుకెళ్తూ కనిపించాడు. ఆ రోజు మీడియా అడిగిన ప్రశ్నలకు అతను సమాధాం చెప్పలేక తప్పించుకున్నాడు. ఆ వ్యక్తితో జ్యోతి మల్హోత్రా కలసి దిగిన ఫొటోలు ఇప్పుడు బయటకొచ్చాయి. అంటే జ్యోతి మల్హోత్రాకు పహల్గాం అటాక్ తో, పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ లోని వ్యక్తులతో సంబంధాలున్నట్టు స్పష్టమవుతోంది.
ఆ వీడియోలే ఆధారం..
ఇన్ ఫ్లూయెన్సర్ జ్యోతి వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకునే నెపంతో జ్యోతి ఎంత తెలివిగా వ్యవహరించిందో అర్థమవుతోంది. భారత్ లోని కీలక ప్రాంతాల సమాచారాన్నంతటినీ ఆమె ఇంటర్నెట్ లో ఉంచింది. నేరుగా గూఢచారులకు ఆమె వీడియోలు పంపించాల్సిన అవసరం లేదు, ఆమె సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అయితే.. వారికి కావాల్సిన సమస్త సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఆ విధంగా ఆమె అకౌంట్ ని నడిపింది. ఇటు పర్యాటకులకోసం వీడియోలు అనే పేరు బయటకు కనపడుతుంది, లోపల ఆమె చేసేదంతా గూఢచర్యం అని తేలిపోయింది. మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారు కాకుండా ఇంకా ఎవరైనా సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ కు సమాచారం చేరవేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది.