- సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి.వెంకటరత్నం పిలుపు
స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాలు పరమావధిగా సంస్కరణల పేరుతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం, రైతాంగం పై దాడి చేస్తోందని దీనికి వ్యతిరేకంగా ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను, గ్రామీణ హార్తాల్ ను జయప్రదం చేయాలని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు, తిరుపతి నగర కార్యదర్శి పి.వెంకటరత్నం పిలుపునిచ్చారు. బుధవారం నారాయణపురం లోని ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో సార్వత్రిక సమ్మె గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పి.వెంకటరత్నం మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులు, కర్షకుల ప్రయోజనాలను పక్కనపెట్టి కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తూ వారికి అనుకూలంగా చట్టాలను తీసుకువస్తోందని మండిపడ్డారు. కార్మిక వర్గ వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి అమలు చేయడానికి సిద్ధమవుతోందదన్నారు. అలాగే రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాల స్థానంలో నూతన వ్యవసాయ మార్కెటింగ్ చట్టాన్ని తీసుకువస్తోందని దీనివల్ల కార్పొరేటర్ సంస్థల భారీ దోపిడీకి రైతులు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. వెంటనే నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని, నూతన వ్యవసాయ మార్కెటింగ్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, ఎనిమిది గంటల పని దినాన్ని పరిరక్షించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ యత్నాలను తక్షణ మాను కోవాలని, కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలన్నారు. వీటితో పాటుగా ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆర్. వెంకయ్య, పి ఓ డబ్ల్యు తిరుపతి జిల్లా అధ్యక్షురాలు ఎం.అరుణ, ఐఎఫ్టియు తిరుపతి కన్వీనర్ పి.లోకేష్, అంగన్వాడి నాయకురాలు జె.గంగాదేవి అలాగే వెంకటస్వామి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
