Latest Posts

జనసేన నుంచి జానీ మాస్టర్ సస్పెండ్..?

ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన టాలీవుడ్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ ఉరఫ్ షేక్ జానీ బాషాపై తాజాగా రేప్ ఆరోపణలు వచ్చాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన ఓ జూనియర్ మహిళా కొరియోగ్రాఫర్ ఆయనపై రేప్, లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లోని రాయదుర్గం పీఎస్ లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ స్పందించింది.

 

రాయదుర్గం పోలీసు స్టేషన్ లో జానీ మాస్టర్ పై కేసు నమోదైన నేపథ్యంలో ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని జనసేన కాన్ఫ్లిక్స్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. దీంతో జానీ విషయంలో పార్టీ సీరియస్ గానే ఉన్నట్లు అర్దమవుతోంది. ఆయనపై ఆరోపణలు రుజువైతే మరిన్ని చర్యలు ప్రకటించే అవకాశముంది.

 

అంతకు ముందు చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్లిన సమయంలో జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపించింది. హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చి కూడా ఆయన పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై స్పందించిన రాయదుర్గం పోలీసులు వివిధ సెక్షన్ల కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీన్ని త్వరలో సంబంధిత పీఎస్ కు పంపనున్నారు.

Posted Under AP
Editor