ప్రత్యేక కథనం..
ప్రసిద్ద చారిత్రక, పురావస్తు దర్శనీయ ప్రదేశాలకు నిలయం అనంతపురము జిల్లా
అనంతపురం, జులై 16 :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతి పెద్ద జిల్లాగా ప్రాముఖ్యత చెందిన అనంతపురము జిల్లా చారిత్రక, పురావస్తు పరంగా చరిత్రలో ఉన్నత స్థానం పొందింది. అనంతపురము జిల్లాకు ఆ పేరు అనంతసాగరం అనే పెద్ద చెరువు నిర్మాణం (1364 సామాన్య కాలం)వల్ల వచ్చింది. ఈ చెరువును ఆనాటి విజయనగర రాజైన బుక్కరాయ-1 (1356-1376) యొక్క ముఖ్య ఉద్యోగి అనంతరస చిక్కదేవ వడయార్, తన రాజు పేరుమీదుగా ఆనంతసాగరం చెరువుకు తూర్పున రాజు పేరుతో బుక్కరాయసాగరం అనే గ్రామాన్ని నిర్మించడం జరిగింది. పడమరవైపున రాజు యొక్క పట్టమహిషి అయినటువంటి అనంతమ్మ పేరు మీదుగా అనంత సాగరం చెరువును నిర్మించాడు. తరువాతి కాలంలో అనంత సాగరమే అనంతపురముగా పిలువబడింది. దేశంలోనే ఒకే జిల్లాలో చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న అనేక పెద్ద పెద్ద చెరువులు అనంతపురము జిల్లాలోనే ఉండటం ఒక విశేషం.*
– *అనంతపురము జిల్లా ప్రాచీన కాలం నుండే వర్తక వాణిజ్యాలు, విలువైన వజ్రాల గనులకు ప్రసిద్ది చెందింది. ప్రాచీన కాలంలో వజ్రాలు, బంగారము మరియు ఇనుప గనుల త్రవ్వకాలు జరిగాయి. ఈ జిల్లాలో జీవనదులు ఎక్కువగా లేకపోయినను ఆనాడు పరిపాలించిన వివిధ రాజ వంశాల వారు అనేక చెరువులు త్రవ్వించి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. 19వ శతాబ్దం రెండవ అర్ధ భాగం మరియు 20వ శతాబ్దం మొదటి అర్ధ భాగంలో బ్రిటిష్ ఉన్నతాధికారులైన రాబర్ట్ బ్రూస్ పుటే, కల్నల్ మెకంజీ, ఫిలిప్ మేడోస్, టేలర్, రాబర్ట్ సన్ మరియు చాలా మంది బ్రిటీష్ మరియు భారతీయ చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు, భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఒక క్రమబద్దమైన అన్వేషణ మరియు త్రవ్వకాలు జరిపి, అనేక పురాతన స్థలాలను గుర్తించి, పురావస్తు త్రవ్వకాలలో పురాతన వస్తువులను, పనిముట్లను వెలికి తీసి జిల్లా చరిత్రను నిర్మించడానికి గొప్ప సమాచారాన్ని సేకరించి పెట్టారు.
– జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) తమ అన్వేషణలో భాగంగా అతి ప్రాచీనమైన 20,000 సంవత్సరాల కాలంనాటి పురాతన మానవ పుర్రెను కల్యాణదుర్గం, రాయదుర్గం మధ్యన నరసాపురం గ్రామం వద్ద సేకరించడమైనది. ఇది ఆనాటి పురా మానవ సంచారమునకు సంబంధించిన అతి ముఖ్యమైన ప్రాచీనమైన ఆనవాళ్ళుగా నిలిచాయి.
– *అనంతపురము జిల్లాను అతి ప్రాచీన కాలం నుండి చిన్న, పెద్ద ఎన్నో రాజవంశాలు పరిపాలించాయి. ఇందులో ముఖ్యంగా గుత్తికి సమీపానే గల ఎర్రగుడి శిలా శాసనం ద్వారా ఈ ప్రాంతం మౌర్య చక్రవర్తి అశోకుడి పాలనలో ఉన్నట్లు ఖచ్చితమైన ఆధారాలు తెలుస్తున్నాయి. మౌర్యుల తరువాత శాతవాహనులు (శాసనాకోట), కదంబులు, పశ్చిమ గాంగులు, పల్లవులు, బాదామి చాళుక్యులు, బాణులు, రేనాటి చోళులు, నొలంబ పల్లవులు, కళ్యాణి చాళుక్యులు, హోయసాలులు, విజయనగర రాజులు, పాళీయగార్లు, ముస్లిం రాజవంశాలు (మొఘలులు, నిజాములు), మరాఠాలు, మైసూర్ పాలకులు (హైదర్ అలీ, టిప్పు సుల్తాన్), మరియు బ్రిటిష్ పాలకులు అనంతపురము జిల్లా పరిసర ప్రాంతాలను పరిపాలించడం జరిగినదిగా చారిత్రక, పురావస్తు ఆధారాల ద్వారా తెలుస్తోంది. నాల్గవ ఆంగ్లో మైసూర్ యుద్ధం (1799) తరువాత జరిగిన ఒప్పందం ప్రకారంగా అనంతపురము జిల్లా హైదరాబాద్ నిజాంల నుండి బ్రిటీష్ వారి అధీనంలోకి వచ్చింది. తదుపరి నిజాంల కాలంలో దత్త మండలాలుగా పిలువబడిన (అనంతపురము, కడప, కర్నూల్, బళ్ళారి మరియు తుముకూరు రీజియన్ లోని పావగడ తాలూకాలు) ఈ ప్రాంతాలలో మొదటి ప్రిన్సిపల్ కలెక్టర్ గా 1800 సంవత్సరంలో సర్ థామస్ మన్రో బాధ్యతలు చేపట్టి అనతికాలంలోనే జిల్లా వాసుల అభిమానాన్ని చూరగొన్నాడు. సర్ థామస్ మన్రో తన కార్యాలయం మరియు నివాస స్థలం అనంతపురములోనే ఏర్పరచుకున్నాడు. నాటి స్మారక స్థలాలు నేటికినూ మన అనంతపురము జిల్లా కేంద్రంలో చూడవచ్చును.*
– *వివిధ రాజవంశాల మరియు పాలకుల కాలంలో జిల్లా అంతటా అనేక ప్రాముఖ్యమైన, ప్రఖ్యాతిగాంచిన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన అనేక దేవాలయాలు, కోటలు నిర్మించబడ్డాయి. కాలక్రమంలో ఆయా కోటలు, దేవాలయాలు, ప్రదేశాలు శిథిలావస్థ చేరుకొనుట మరియు ఆక్రమణ దారులతో కుచించుకుపోవుట తదితర కారణాల రీత్యా మసకబారుతున్న వాటి యొక్క ప్రాముఖ్యతకు తిరిగి జీవం పోసి, వాటిని పరిరక్షించి భావితరాలకు అందించే బృహత్తర బాధ్యతను రాష్ట్ర పురావస్తు మరియు ప్రదర్శన శాలల శాఖ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రాచీన చారిత్రక నిర్మాణ, పురావస్తుస్థల, శిధిలముల చట్టము- 1960 ప్రకారంగా ఆయా చారిత్రక, పురావస్తు ప్రాధాన్యత కలిగిన కట్టడాలను గుర్తించి, పరిరక్షించి సంరక్షిస్తున్నది. అనంతపురము జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ వారి మార్గ నిర్దేశకత్వంలో జిల్లాను సందర్శించు సందర్శకులు, జిల్లా ప్రజలకు ఆనాటి వైభవాన్ని తెలిపేలా చారిత్రక, వారసత్వ కట్టడాలు, దేవాలయాలు, కోటలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా, పిలిగ్రిమేజ్ సెంటర్లు గా అభివృద్ధి చేయుటకై నిర్ణయించి, కొన్ని చారిత్రక, పురావస్తు ప్రాధాన్యత కలిగిన కట్టడాలు, దేవాలయాలను టూరిస్ట్ సెంటర్లుగా ఎంపిక చేయడమైనది. అనంతపురము జిల్లాను సందర్శించిన ప్రతి ఒక్కరు జిల్లా యొక్క ఘనమైన వారసత్వ సంపదైన కోటలు, దేవాలయాలను సందర్శించి, జిల్లా యొక్క చరిత్రను తెలుసుకొనే నిమిత్తం, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ వారి యొక్క నిర్దేశంలో రాష్ట్ర పురావస్తు మరియు ప్రదర్శన శాలల శాఖ, దేవాదాయ శాఖ మరియు పర్యాటక శాఖల ఉమ్మడి ఆధ్వర్యంలో సర్క్యూట్ లను ఏర్పాటు చేయబోవుట జరుగుచున్నది. ఇవి భవిష్యత్తులో అనంతపురము జిల్లాను సందర్శించే సందర్శకులకు అద్భుతమైన అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. ఇవి ఆదిమానవుడు మొదలు ఆధునిక బ్రిటీష్ కాలం వరకు కూడా చరిత్ర ప్రాముఖ్యత పొందిన అనేక కట్టడాలు, మతపరమైన దేవాలయాల వివరాలు ఇలా ఉన్నాయి.*
*1. చింతల వెంకటరమణ స్వామి మరియు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాలు, తాడిపత్రి, అనంతపురము జిల్లా.*
– తాడిపత్రి పట్టణ మధ్య భాగములో శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయము పెమ్మసాని రామలింగనాయని కుమారుడైన శ్రీ తిమ్మనాయనిచే, నిర్మాణమైనట్లు తాడిపత్రి కైపియత్ ద్వారా తెలుస్తున్నది. బహుశా క్రీ.శ. 1510- 1525 సం.ల మధ్య కాలములో నిర్మాణము జరిగియుండవచ్చునని భావించడమైనది. ఈ తారీఖులు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి యైన శ్రీ కృష్ణ దేవరాయల పాలన కాలంతో (1509-1529) సరిపోలుతున్నాయి. ఈ ఆలయ స్తంభాలపై రామాయణ, భాగవత గాథలలోని ఘట్టాలు చెక్కబడ్డాయి. ఇవి చూపురులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
2. బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం, తాడిపత్రి, అనంతపురము జిల్లా.
– విజయనగర సామ్రాజ్య ప్రభువు శ్రీ విరూపాక్ష రాయల కాలంలో తాడిపత్రి ప్రాంత మండలేశ్వరుడైన, పెమ్మసాని రామలింగనాయడు 15వ శతాబ్దములో సుమారు 1460- 1475 C.E. సం.. ల మధ్య కాలములో శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయము. పెన్నానది ఒడ్డున తాడిపత్రిలో నిర్మించడం జరిగింది. ఈ దేవాలయము అద్భుతమైన శిల్పసంపదతో అలలారుతున్నది. ఆలయమును సందర్శించిన సందర్శకులు ఆలయంలోని శిల్పసంపదను చూచి ముగ్ధులవుతారు. ఈ కట్టడం ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి అధీనంలో ఉన్నది.
3. శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవాలయం, కసాపురం గ్రామం, గుంతకల్లు మండలం. అనంతపురము జిల్లా.
– అనంతపురము జిల్లా, గుంతకల్లు మండలము, కసాపురం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం ఉన్నది. ఈ దేవాలయంలోని మూలవిరాటైన శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం విజయనగర సామ్రాజ్య పాలకుడైన శ్రీ కృష్ణ దేవరాయలు (1509-1529) యొక్క గురువైన వ్యాసరాయలుచే క్రీ.శ 1521 సంవత్సరములో ప్రతిష్టించినట్లు చెప్పబడుచున్నది. ఈ ఆలయమును కన్నడ భక్తులు, తెలుగు భక్తులు అత్యధికంగా సందర్శించుకుంటారు. ముఖ్యమైన పర్వదినాలలో అలయమునకు విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు యాత్రికులకు సకల సౌకర్యాలు కల్పించబడుచున్నవి.
4. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, పెన్నహోబిలం గ్రామం, ఉరవకొండ మండలం, అనంతపురము జిల్లా.
– ఆంధ్రప్రదేశ్ లో నవ నారసింహ క్షేత్రములలో అతి పురాతనమైనది మరియు స్వయంభు క్షేత్రములలో మొదటిది అహోబిలంకాగా, రెండవది పెన్నహోబిలం క్షేత్రముగా ప్రఖ్యాతిగావించినది. ఈ దేవాలయము శాలివాహన శకం 1478 సంవత్సరములో శ్రీ కృష్ణదేవరాయల వారిచే అనంతపురము – ఉరవకొండ రహదారి ప్రక్కన పెన్నానది 3 కిలోమీటర్ల దూరమున గల ఒక గిరిపై శ్రీ పెన్నహోబిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము నిర్మింపబడి ఉన్నది. శ్రీ స్వామి వారికి అభిషేకించిన తీర్ధమంతయు పాదము క్రింద భాగమున ఉన్న బిలము ద్వారా పోయి పెన్నానదిలో కలుస్తుంది. అందువల్ల ఈ క్షేత్రానికి పెన్నహోబిలం అని పిలవబడుతోంది.
5. గుత్తి కోట, గుత్తి, అనంతపురము జిల్లా.
– గుత్తి కోట చాళుక్యుల కాలములో కట్టబడినదని భావిస్తారు. లభ్యమైన శాసనాల ప్రకారంగా క్రీ.శ. 1076-1126 వరకు పాలించిన త్రిభువనమల్ల పశ్చిమ చాళుక్య రాజు VI విక్రమాదిత్య కాలం నాటిదిగా గుత్తికోటను నిర్ధారించవచ్చు. కోట మరియు చారిత్రక నిర్మాణాలు చాళుక్యుల కాలం నాటివని చెప్పవచ్చును. గుత్తికోటను విజయనగర రాజులు పటిష్టం చేశారు. విజయనగర సామ్రాజ్య కాలంలో గుత్తికోటను సామ్రాజ్యానికి నాభిగా పేర్కొనేవారు. వెంకటపతిరాయ2(1584-1614) పాలనలో గుత్తికోట కుతుబ్ షాహీల చేతుల్లోకి వచ్చింది. క్రీ.శ.1746లో మురారి రావు ఆధ్వర్యములో మరాఠులు దీనిని జయించారు. 1775 లో హైదర్ అలీ గుత్తి కోటను తొమ్మిది నెలల నిర్బంధము తర్వాత వశపరచుకొనెను. 1799 లో టిప్పూసుల్తాన్ మరణానంతరము జారువర్ ఖాన్ అనే ముస్లింగా మారిన బ్రాహ్మణ సేనాని ఆధీనములో ఈ కోట ఉండగా నిజాము తరఫున బ్రిటిషు కల్నల్ బౌజర్ కోటను ఆక్రమించుకొని బ్రిటిషు వారి పాలనలోకి తెచ్చాడు. కొండ దిగువన యూరోపియన్ స్మశానవాటిక ఉంది. ఇక్కడ 1827 జూలై 6న పత్తికొండ (కర్నూలు జిల్లా)లో కలరాతో మరణించిన సర్ థామస్ మున్రో మృతదేహాన్ని ఉంచబడింది.
*ఇతర చారిత్రక, పురావస్తు, ఆలయ సంబంధిత దర్శనీయ ప్రదేశాలు :*
– *జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ వారి మార్గ నిర్దేశకత్వములో రాష్ట్ర పురావస్తు మరియు ప్రదర్శన శాలల శాఖ, దేవాదాయ శాఖ మరియు పర్యాటక శాఖలు కలిసి అనంతపురము జిల్లాను ఒక టూరిస్ట్ హబ్ గా రాష్ట్రంలోనే మొదట స్థానంలో నిలిపేందుకు ప్రయత్నాలు ఆరంభించడమైంది. ఇందులో భాగంగా జిల్లా సందర్శనకు వచ్చిన సందర్శకులకు జిల్లా యొక్క చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తూనే, వారికి మానసికోల్లాసం కలిగించేందుకు మరియు నిరుద్యోగ యువతకు ఉపాధి చూపేందుకు టూరిజం పోటెన్షియాలిటీ కలిగిన మరికొన్ని ప్రదేశాలను, దేవాలయాలను, కోటలను గుర్తించడమైనది. వాటి వివరాలు…
– 1. కోన రంగనాథస్వామి దేవాలయం, ఆలూరుకోన, తాడిపత్రి మండలం, అనంతపురము జిల్లా.
– 2. మల్లిఖార్జున దేవాలయం, కంబదూరు మండలం, అనంతపురము జిల్లా.
– 3. రామ, కృష్ణ దేవాలయములు, రాయదుర్గం కోట, రాయదుర్గం మండలం, అనంతపురము జిల్లా.
– 4. నేమకల్లు అంజనేయస్వామి దేవాలయం, మురిడి గ్రామం, హీరేహల్ మండలం, అనంతపురము జిల్లా.
– 5. సుబ్రమణ్యేశ్వర స్వామి దేవాలయం, పంపనూరు గ్రామం, ఆత్మకూరు మండలం, అనంతపురము జిల్లా.
– 6. మల్లోబుల నరసింహస్వామి దేవాలయం, పంపనూరు గ్రామం, ఆత్మకూరు మండలం, అనంతపురము జిల్లా.
– 7. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం, బూదగవి గ్రామం, ఉరవకొండ మండలం, అనంతపురము జిల్లా.
– 8. శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం, చుక్కలూరు గ్రామం, తాడిపత్రి మండలం, అనంతపురము జిల్లా.
– 9. కుందుర్పి ఫోర్ట్ గ్రామం, కుందుర్పి గ్రామం & మండలం, అనంతపురము జిల్లా.
– 10. పీస్ మెమోరియల్ హాల్, అనంతపురము జిల్లా.
– 11. శిల్పారామం, అనంతపురము జిల్లా.
