ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్న బీఆర్ఎస్ నేతల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా, సీఎం రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ మాజీ మేయర్, బీఆర్ఎస్ నేత బొంతు రామ్మోహన్ కలిశారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చిన రామ్మోహన్.. రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.
ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే, బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం. ఆయన మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కాగా, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్న బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుండటంతో రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కలిశారు. అయితే, తాము మర్యాద పూర్వకంగానే సీఎంను కలిశామని వారు చెప్పారు. అంతకుముందు నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు పలు కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. సీఎం, మంత్రులను కలిసే ముందు పార్టీకి సమాచారం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులకు సూచించారు. లేదంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు పార్టీ అధిష్టానంకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కలుస్తుండటం గమనార్హం. అయితే, కొందరు బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ ప్రాంత సమస్యలపై కలుస్తున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు చేరతారంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో సీఎం, మంత్రులతో బీఆర్ఎస్ నేతల భేటీలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.పార్లమెంటు ఎన్నికల్లోపే వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు, గత కొద్ది రోజుల క్రితమే పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు, బీఆర్ఎస్ నేత వెంకటేశ్ నేత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
