కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మంగళవారం రాత్రి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. 100 లక్షల కోట్లు అప్పు చేశారని రేవంత్ ఆరోపించారు.
దేశం పూర్తిగా దివాళా తీయడానికి మోడీనే కారణమన్నారు. అప్పులు, ఫిరాయింపుల్లో ప్రధాని మోడీ, కేసీఆర్ పోటీ పడ్డారని విమరక్శించారు. దేశానికి రాహుల్ గాంధీ నాయకుడు అవసరమని రేవంత్ చెప్పుకొచ్చారు. మోడీ రైతులను పట్టించుకోలేదన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారన్నారు. మూడోసారి ప్రధానిని చేసేందుకు మోడీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుందని రేవంత్ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్లేనని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సచ్చిపోయిందన్న రేవంత్.. బావాబామ్మర్దులే పోటీ పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై బీఆర్ఎస్ ఏనాడు కేంద్రంతో పోరాడలేదని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ అడగలేదు.. మోడీ ఇవ్వలేదన్నారు. తెలంగాణ హక్కులను కేంద్రం నిర్లక్ష్యం చేసిందన్నారు. విభజన హామీలు నెరవేర్చాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ఉండాలన్నారు సీఎం రేవంత్.
తెలంగాణ నుంచి 17 ఎంపీ సీట్లు గెలిస్తే తెలంగాణకు మేలని రేవంత్ వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక అధిష్టానం చూసుకుంటుందన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులు గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 3 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవాలని తెలిపారు. ఓసీలు దరఖాస్తు రుసుంగా రూ. 50 వేలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 25 వేలు చెల్లించాలని వివరించారు.
ప్రతి ఒక్క పార్లమెంట్ స్థానంకు ఇంఛార్జీ నియమించామన్నారు రేవంత్. ఇంఛార్జీలుగా మంత్రులు, నేతలు ఉంటారన్నారు. త్వరలోనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 2 ఇంద్రవెల్లి నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తామన్నారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని తీర్మానం చేశామని తెలిపారు.
బీఆర్ఎస్ నేతలు పిచ్చిపిచ్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు రేవంత్. రాజకీయ కుట్రతోనే ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కోదండరాంను కేసీఆర్ దొడ్లో చెప్పులు మోసేవారితో పోల్చడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్. కోదండరాంను అడ్డుకోవడం బీఆర్ఎస్ భావదారిద్య్రానికి నిదర్శనమని మండిపడ్డారు.
