తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రముఖ వ్యాపార దిగ్గజాలతో భేటీ అయ్యారు. దావోస్ పర్యటనలో బిజీబిజీగా గడిపిన రేవంత్ రెడ్డి ఆపై లండన్లో మూసి పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు వెళ్లారు. థేమ్స్ నది చరిత్ర ,అభివృద్ధికి ఎదురైన సవాళ్లు, ఇంజనీరింగ్, పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలను వారిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం లండన్ పర్యటనలో తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఫలితాలే పార్లమెంటు ఎన్నికలలో రిపీట్ అవుతాయని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతులో పాతి పెడతామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
లండన్ పర్యటనలో అసంబద్ధమైన మాటలు మాట్లాడి రాష్ట్రం పరువు తీశారు అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి పాండిత్యాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారని ఆయన ఎద్దేవా చేశారు. అక్కడ అడిగింది ఒకటైతే ఈయన చెప్పింది ఇంకొకటి అంటూ రేవంత్ రెడ్డి అసమర్థతను చూసి జనం నవ్వుకుంటున్నారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
కారు పార్టీని 100 మీటర్ల లోతు బొంద పెడతామని రెడ్డి చౌకబారు వ్యాఖ్యలు చేశారని అసహనం వ్యక్తం చేశారు. కెసిఆర్ సంగతి చూస్తానన్న రేవంత్ రెడ్డి రాజకీయ గురువు చంద్రబాబు వల్లే కాలేదని, రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ నుంచి పలాయనం చిత్తగించాడు అని, కెసిఆర్ జోలికి వస్తే రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
